FATHER OF INDIAN WORKING JOURNALISM
హస్తినలోనే కాక అంతర్జాతీయ పాత్రికేయుల సమీక్షలను నిర్వహించిన ఘనత ఆది స్వాతంత్య్రోద్యమంలో, అదృశ్య పత్రికోద్యమాన్ని కూడా నిర్వహించిన గొప్పదనం ఆయనది. ఆంగ్లంలో ఆయన రచనలు, సంపాదకత్వం సాగినా.. ఆయన మాత్రం పదహారణాల అచ్చతెలుగు బిడ్డ అని ప్రస్తావించక తప్పదు. శ్రీకాకుళానికి చెందిన ఆయన విశాఖలో 1908లో జన్మించారు. విశాఖపట్నంలోనే ఎం.ఏ., బి.ఎల్. పట్టాలను పొంది కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన “ఎథేనియం” అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంస్థను నెలకొల్పి తాను కార్యదర్శిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత “పీపుల్స్ వాయిస్”, “వీక్ ఎండ్” మరియు “హిందూస్థాన్ టైమ్స్" పత్రికలలో సహాయ సంపాదకులుగా పనిచేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు 1938లో లక్నోలో నెహ్రూ ఆశయాలతో శ్రీకారం చుడితే, సహాయ సంపాదకుడిగా చేరి.. ఆ తర్వాత అదే పత్రికకు సంపాదకుడిగా 1946 నుంచి మూడు దశాబ్దాలపాటు మనికొండ చలపతి రావు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. పత్రికా రంగం, రాజకీయాలు, ప్రముఖ వ్యక్తిత్వాలపై రచనలు చేసిన చలపతిరావు చతురులు.
సమాజంలో మార్పు అవసరం, ఆ సామాజిక పరివర్తనే నిజమైన వార్త అని భావించిన అగ్రగన్యుడు. సమాచారాన్ని, వివరణనూ అందించే సాధనంగా జర్నలిజం అనాదిగా సాగుతుండగా, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ప్రాముఖ్యాన్ని గురించి చెప్పడానికి ముద్రిత చరిత్రనుకాని, పత్రికా రచన పరిణామాన్ని కాని వివరించవలసిన అవసరం లేదని తన రచనలను అందుకు భిన్నంగానే తీసుకువచ్చి ప్రజలను చైతన్యం చేసిన ప్రజ్ఞాశాలి. ఇలా నూతన మార్పులకు కార్యోన్ముడైన ఆయన పాత్రికేయుడు తమ సామాజిక బాధ్యతలను ఎన్నడూ మరవరాదని కూడా సూచనలు చేశారాయన. పరిసరాల మార్పునకు ప్రయత్నించాల్సిన బాధ్యత ప్రచార సాధనాలదే.. అందునా ప్రతి పాత్రికేయుడేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ సామాజిక బాధ్యతలను విస్మరించినట్లయితే అవి ఉండాల్సిన అవసరం లేదు. మనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నమోదు చేయడంలో, వాటికి బాష్యం ఇవ్వడంలో విలేకరి సామాజిక శాస్త్రవేత్తగా ఉండాలని ఉద్భోద చేసి.. దానికే కంకణబద్ధులయ్యారు చలపతి రావు. “కానీ నేటి జర్నలిజంలో సామాజిక బాధ్యత కొరవడుతోంది. అధికారానికి, స్వేచ్ఛకూ మద్య సాగిన సుదీర్ఘ ఆందోళనలో జర్నలిజం.. రాజకీయాలు కవలలుగా రూపొందాయని" అని 1960 దశకంలోనే ఆయన అన్నారు.
జర్నలిస్టు నేతగా పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవ మరువరానది.. సమాజాభివృద్ధిని, పత్రికారంగ వ్యవస్థాభి వృద్ధిని అత్యద్భుతశైలితో నడిపించి చూపించారయన. అఖిల భారత పత్రికాకారుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1950 1955 వరకు తన ప్రతిభను ప్రదర్శించడం, 1955లో నెహ్రూతో భారతీయ పత్రికా సమాఖ్యలో భాగంగా రష్యా, పోలెండ్, యుగోస్లావియాలలో పర్యటించారు మనికొండ. భారతీయ సత్సంబంధ బృందంలో భాగంగా 1952లో చైనా పర్యటన, యునెస్కో పత్రికా నిష్ణాతుల సమాఖ్యలో సభ్యత్వం, యునెస్కో కమిషన్లలో నిర్వహణ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారతీయ ప్రతినిధి (1958), అంతర్జాతీయ పత్రికాసంస్థ కోసం ఏర్పాటైన తొలి సమాఖ్యలో సభ్యత్వం మనికొండకు లభించాయి.
పత్రికా సంపాదకుని వృత్తిని, ప్రవృత్తిని సరిసమత్వంతో జోడించుకుంటూ, తన పరిమితుల్ని విశ్లేషించుకుంటూ, తన జేబులో రాజీనామా పత్రాన్ని నిత్యం పదిలపరుచుకున్న పాత్రికేయుడు చలపతిరావు. తనదైన పదునైన మాటలతో, రచనలతో పాటు, నిశ్శబ్ద విప్లవకారుడుగా కూడా ఆయన పేరుపొందారు. మనికొండ రచించిన అనేక గ్రంథాల్లో భారతీయ విప్లవం- సమస్యలు- గాంధీ, నెహ్రూ, గోవింద వల్లభ్ పంత్ ల జీవిత చరిత్రలు, భారతీయ ప్రముఖుల వ్యక్తిత్వ కథనాలు, పత్రికారంగం- రాజకీయ రంగాల సమన్వయం, భారతీయ పత్రికారంగంపై వివరణాత్మక విశ్లేషణలు, నెహ్రూ రచనలకు సమగ్ర భాష్యాలు, నెహ్రూ రచనలకు సమగ్ర భాష్యాలు, భారతీయ స్వాతంత్య్ర రజతోత్సవంపై రచనలు, ఆయన ప్రతిభా కిరీటానికి మచ్చుతునకలు. మనికొండ వార్తారచనలు నిత్యం వెలువడినా, వాటిలో లోతులు, ఆలోచనలు తప్పితే హడావుడి తనం ఎప్పుడూ వెల్లడవ్వలేదు. ఆరు దశాబ్దాల క్రితం ఆధునికత, విజ్ఞానం రెండూ అందుబాటులోలేని సమాజంలో అన్ని మెప్పించేలా పత్రికా రచనను రంగాలవారిని నిర్వహించారాయన. చలపతిరావు విద్యకు విజ్ఞత, వివేకం తోడయ్యాయి. సుసంపన్నమైన పేరు ప్రఖ్యాతులను అందించిన వృత్తిపట్ల ఆయనకున్న గౌరవాభిమానాన్ని కొలిచేంద ఏ కొలమానమూ చాలదు. పాత్రికేయ రంగానికి వన్నె తెచ్చిన ఆయనను.. పాత్రికేయులకు ఆయన చేసిన సేవలను అనునిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జర్నలిస్టు కాలనీలో ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఆయన అలోచనావిధానాలు, విలువలను ఈ తరం పాత్రికేయులు కూడా ఆచరించాలని మనసారా కోరుకుందాం.