Fill the form, we are preserving balija surnames and their history.

విన్నకోట వెంకటస్వామి నాయుడు


కలంకారీ క్రీస్తు పూర్వమే పర్షియన్ దేశస్థుల ద్వారా మన దేశమునకు దిగుమతి అయినదని చరిత్ర చెబుతున్నది. కలంకారీ అను పదము పర్షియన్ భాష నుండి వచ్చినదని, దీని అర్ధము కలముతో చేయు పని అని అందరికీ తెలిసిన విషయమే. ఈ కళ మన దేశములోని పలు రాష్ట్రములలో కనిపించినా ప్రత్యేకించి బందరులోని కళ ప్రపంచములో అందరికీ అకట్టుకున్నది. ముఖ్యముగా బందరు రేవు పట్టణము కాబట్టి ఇక్కడి కలంకారీ వస్త్రాలకి బహుళ ప్రచారము లభించింది.కలంకారీ వస్త్రాలకి ముఖ్యముగా కావలసిన బ్లాకులు మరియు రంగులు. చెక్కపై చెక్కిన వివిధ రకాల డిజైనులను బ్లాకులు అంటారు. 

ఈ బ్లాకులలోని డిజైనులు భారతీయులకు, ఇస్లాము దేశస్థులకు, పాశ్చాత్య దేశస్థులకు వారి వారి అభిరుచిని బట్టి తయారు చేస్తారు. కావలసిన రంగులు వివిధ వనమూలికలతో తయారు చేస్తారు. ఎటువంటి రసాయనాలు కలపని ఈ రంగులతో గుడ్డపై అద్దకము వేసి డోర్ కర్టెన్లు, దుప్పట్లు, దిండు గలేబులు, టేబుల్ క్లాత్, లుంగీలు, చీరలు మొదలైనవి తయారు చేస్తారు.బందరులో ఒక చిన్న తరహా పరిశ్రమగా అభివృద్ధి చెంది బందరు పట్టణానికే వన్నె తెచ్చినది ఈ కలంకారీ బందరులోని కలంకారీ కళకి మరియు పరిశ్రమకి ఇరవయ్యవ శతాబ్దపు రెండవ అర్థ భాగంలో దేశ, విదేశాల్లో గుర్తింపు. ఖ్యాతి రావడానికి స్వర్గీయ విన్నకోట వేంకట స్వామి నాయుడు గారు చేసిన కృషి, శ్రమ క్లాఘనీయము. వీరికి ఈ కళ వంశపారంపర్యంగా వచ్చినది. వీరి పితామహులైన సుబ్బారాయుడు గారు, తండ్రి వేంకట బ్రహ్మయ్య నాయుడు గారు, పినతండ్రి సుబ్రమణ్య నాయుడు గారు ఈ కళలో నిష్ణాతులు. స్వర్గీయ వేంకట బ్రహ్మయ్య నాయుడు గారు రెండు పర్యాయములు మద్రాసు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి నుండి పతకములు, ప్రశంసా పత్రములు పొందినారు. 

కీ.శే. విన్నకోట వేంకట స్వామి నాయుడు గారు ఈ కళలో వారి తండ్రి. గారి నుండి శిక్షణ పొందారు. అతి పిన్న వయస్సులో అనగా తమ ఇరవై రెండవ యేట, 1924లో లండన్లో నిర్వహింపబడిన "వెంపై బ్రిటిష్ ఎంపైర్ ప్రదర్శనలో తాము పర్షియన్ డిజైన్లో పంపిన కలంకారీ ద్వారబంధన తెర అందరినీ ఆకర్షించి, అప్పటి బ్రిటీష్ యువరాజైన ఎడ్వర్డ్ 8 ద్వారా ప్రశంసా పత్రము మరియు స్వర్ణ పతకము  పొందారు. ఈ కళని అభివృద్ధి చేయాలని ఎంత తాపత్రయపడి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము నుండి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో ఈ కళ తెరమరుగయ్యింది. అయినా వెనుకంజ వేయక శ్రీ నాయుడు గారు 1949లో "బల్యాల గూడెం కోఆపరేటివ్ ఇండస్ట్రీస్, ప్రొడక్షన్ & సేల్స్: సొసైటీని స్థాపించారు. వారే కొన్ని సంవత్సరములు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. కానీ కొన్ని బాలారిష్టాలు తప్పలేదు.

కలంకారి కళలో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వము 1976లో బహుకరించిన జాతీయ పురస్కారము "తామ్రపత్రము”



1952లో కీ.శే. పట్టాభి సీతారామయ్య గారు ఇచ్చిన చేయూత ఫలితముగా ఈ కళకి పునర్జన్మ లభించినది. దీనికి తోడు అఖిల భారతీయ ఖాదీబోర్డు వారు కూడా తమవంతు సహాయాన్నిఅందించారు. అప్పటి అఖిల భారత చేతి పరిశ్రమలఅధ్యక్షురాలైన శ్రీమతి కమలాదేవి ఛటోపాధ్యాయకూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తగు రీతిలో తమసహాయ సహకారాలు అందజేసారు. ఈ అభివృద్ధికోసం పాటుపడిన బందరులోని కొన్ని కుటుంబాలురేకపల్లి, అనుమకొండ, వడ్లమూడి వారు.ఈ కళను అందరికీ నేర్పి దేశమంతటా తెలియ జేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వము వారి సహాయముతో 1955లో ఒక శిక్షణాలయము స్థాపించారు. ఇందులో అనేకులు శిక్షణ పొందారు. సొసైటీ ఆధ్వర్యములో నడుచుచున్న కలంకారీ పరిశ్రమలో పనిచేసిన కార్మికులలో ఎక్కువ భాగము నాయుడు గారి వద్ద శిక్షణ పొందిన వారే కావడము గమనార్హము వంశపారంపర్యంగా వచ్చిన కలంకారీ కళను బహుళ ప్రచారము చేయవలెనన్న తపనతో రాత్రులు కృషిసల్పి దేశమునందే కాక యితర దేశాలలో కూడా ఈ కళ యొక్క ప్రత్యేకతను చాటిన ఘనత నాయుడు గారికే దక్కినది. ఇతర రాష్ట్రముల వారు, ఇతర దేశముల వారు ముఖ్యముగా జర్మనీ. జపాన్ దేశస్థులు ఈ కళను ఎంతగానో ప్రశంసిం చడము జరిగినది. శ్రీ విన్నకోట వేంకటస్వామి నాయుడు గారి కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వము 1976లో అప్పటి రాష్ట్రపతియైన గౌరవనీయ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిచే జాతీయ పురస్కారము "పత్రము" బహుకరించుట జరిగినది.

శ్రీ నాయుడు గారు కేవలము కలంకారీ కళాకే పరిమితం కాకుండా వివిధ రంగాలలో తమ సేవలు అందించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. స్వాతంత్య్ర పోరాట ములో యోధులుగా పాల్గొని దేశసేవ చేశారు. 1942లో జరిగిన 'క్విట్ ఇండియా' ఉద్యమములో బందరు వాసులందరినీ ప్రోగుచేసి ఉధృతంగా పోరాడి నందుకు మహాత్మాగాంధీ గారు స్వయంగా ప్రశంసించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వము ఫించను యివ్వచూపినా తిరస్కరించిన మహానుభావుడు. రెండు దశాబ్దాలు పైగా బందరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా వుంటూ తన విశిష్ట సేవలు అందించారు. వీరు కృష్ణాజిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకుకి అధ్యక్షులుగా ఉన్నారు. అభిల భారత హస్తకళల బోర్డులో సభ్యులుగా ఉంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారముతో కలంకారీ కళకు మరింత ప్రాముఖ్యము తెచ్చారు.

వీరి సతీమణి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు, శ్రీ నాయుడు గారికి చేదోడు వాదోడుగా వుంటూ వారి విజయానికి వెనుక ఉండి ఎంతో శ్రమించిన ఉత్తమ ఇల్లాలు.బందరు పట్టణంతో ఇంతటి అనుబంధాన్ని కలిగి, కలంకారి కళతో ఆ పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన శ్రీ విన్నకోట వెంకటస్వామి నాయుడు గారి పేరు మీద ఆయన కుటుంబ సభ్యులు కళ్యాణ మండపం నిర్మించి బందరు పట్టణ చరిత్రలో ఆయన పేరును సుస్థిరం చేయడం హర్షణీయం.

Post a Comment

Previous Post Next Post