Fill the form, we are preserving balija surnames and their history.

ఉమ్మక్క దేవి - గోనుగుంట బలిజ

 


క్రీ.శ. 14వ శతాబ్దములో ప్రముఖ రత్నాల వ్యాపారి నవరత్నాల పరీక్షకులు అయిన ప్రోలరాజు ఆనాటి కొండవీటి రాజ్యములోని అమ్మనబ్రోలు సీమలోని "గోనుగుంట” గ్రామ నివాసి. ఈనాటి ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, గోనుగుంట గ్రామం, ఆయనకు నలుగురు కుమారులు, పెద్దవాడు చెన్మమరాయుడు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దకుమార్తె ముమ్మక్కదేవి (ఉమ్మక్క)ని మల్లప్ప వడయాల్కు ఇచ్చి వివాహము చేశారు. వీరి వివాహానంతరం కొండవీటి రాజ్యములో సైనాధికారిగా, తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని సింధూర కటకం పాలకుడు బళ్లాల రాయుని వద్ద మంత్రిగా నియమింపబడినాడు.

మల్లప్ప వడయల్ కళాభిమాని, కవులను, గాయకులను, శిల్పులను ఆదరించి సత్కరిస్తూ ఉండేవాడు. యాచకులకు అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తుండెడివారు. ఈయన భార్య ముమ్మక్కదేవి అందాలరాశి సుగుణవతి, పతిసేవయే పరమార్ధంగా బావించే పరమ పతివ్రతామతల్లి. గౌరీదేవి భక్తురాలు. మహామంత్రి భార్యననే గర్వము ఆమెకు ఏ మాత్రము లేదు. కోటలోని స్త్రీలతో కలిసి మెలిసి ఉండేది. తనపూజా మందిరంలో స్త్రీలందరికి భక్తి పాటలు పాడుతూ ఎంతో మధురంగా గానం చేసి వినిపిస్తుండేది. మిగిలిన స్త్రీలను పాడమని ప్రోత్సహిస్తుండేది. ఖాళీ సమయాల్లో స్త్రీలకు పురాణ గ్రంధ పఠనము మరియు క్షత్రియవిద్యలు ఆమె అభ్యసించి మిగిలిన స్త్రీలను గూడా ప్రోత్సహిస్తూ ఉండేది. మల్లప్ప వడయల్ గారు సద్గుణవంతురాలైన భార్య దొరకడం తన అదృష్టంగా భావించి ఆనందించేవాడు.

సింధూర కటకం రాజయిన వీర బళ్లాళుడు, బోగలాలసుడు బోగాలను అనుభవించడానికే “రాజు” పదవి అని అతని నమ్మకము రాజ్యబారం మంత్రిపై పెట్టి రాసక్రీడలు, జలక్రీడలతో సుందరాంగుల పొందుతో విందులు, వినోదాలతో కాలం గడుపుతుండేవాడు. ఎంత బోగలాలసుడైనా మహావీరుడైన మంత్రి మాటకు ఎదురు చెప్పేవాడుకాదు. రాజు హద్దులు మీరుతుంటె హెచ్చరించి హద్దులలో పెట్టేవాడు మల్లప్ప వడయల్ గారు.

ప్రతి సంవత్సరము స్త్రీలకు పర్వదినమైన “గౌరీవ్రతము” రోజు (అట్లతద్దె) వచ్చింది. అమావాస్య వెళ్లిన మరునాడు వచ్చే “విదియ” రోజునుండే ముమ్మక్కదేవి అంతఃపురమంతా బంధువులు, స్నేహితులయిన బలిజ యువతులతో నిండిపోయింది. తదియ (అట్లతదియ) నాడు ఆమె అందరికి పట్టు బట్టలు యిచ్చి ఆమె సర్వాంగసుందరంగా అలంకరించుకుంది ఈమె అందం వర్ణనాతీతం. సాక్షాత్తు గౌరీ దేవియే ఈరూపంలో వచ్చిందా! అని పడుతులందరూ ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో గౌరీపూజ చేశారు. పూజ ముగిసిన తర్వాత ముమ్మక్కదేవి కర్పూర హారతి ఇవ్వడానికి కర్పూరం వెలిగించింది. హారతి ఇస్తుండగా కర్పూరం హటాత్తుగా ఆరిపోయింది. ఆమె కుడి కన్ను అదిరింది ఆమె జడ నుండి పువ్వులు రాలిక్రింద పడ్డాయి. కొన్ని అపశకునములు గోచరించాయి. ఈ హటాత్పరిణామానికి ముమ్మక్కదేవి నివ్వెరపోయింది. మనస్సు కీడును శంకించింది. భయంతో ఆమె దేహం ఒక్కక్షణం వణికింది. దానిని చూచిన ముత్తయిదువులు గాలికి దీపం ఆరిపోయిందని మరలా వెలిగించమని చెప్పినమీదట ముమ్మక్కదేవి మళ్లీ కర్పూరం వెలిగించి గౌరీదేవికి హారతి ఇచ్చింది. కాని ఆమెలో ముందున్న ఉత్సాహం కనిపించలేదు. ఆమె మనస్సు కీడును శంకిస్తూనే ఉంది. తర్వాత అందరూ విందారగించారు, తర్వాత ఆటలాడారు, పాటలు పాడారు తర్వాత మరుసటి రోజు ఉయ్యాలపండుగకు సిద్ధం చేశారు.

ముమ్మక్కదేవితో బాటు స్త్రీలందరూ ఉయ్యాలలూగడానికి ఉద్యానవనము ప్రక్కనే ఉన్న గౌరీదేవి ఆలయములో పూజలు జరిపారు. అక్కడికి మగవారెవ్వరూ అడుగు పెట్టకూడదు. ఆరోజు ఉద్యానవనములో ఏర్పాటు చేసిన ఊయల కెదురుగా ఊయల ఊపుకు అందీ అందనట్లుగా ఆచెట్టు కొమ్మకు చక్కగా కట్టిన పూలమాలను ఉంచుతారు. దానిని దేవమాలు అని అంటారు. ఉయ్యాల ఊగుతూ ఆకొమ్మకు గట్టిన మాలను తీసుకురావాలి. ఆవిధంగా తెచ్చిన దేవమాలను మేళతాలతో ఉద్యానవనం నుండి ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి మెడలో వేసి పూజలు చేస్తారు. ఆమాలను ఎవరైతే పట్టుకొస్తారో వారి కోరికలను “గౌరీదేవి” నెరవేరుస్తుందని స్త్రీలనమ్మకము.

దేవమాలను ముమ్మక్కదేవి చేజిక్కించుకుంది ఆసమయములో ఉద్యానవనానికి బయట పొదలమాటు నుండి తోటలో ఆటపాటలతో మునిగిఉన్న ఆడవారి అందచందాలను తిలకిస్తున్న బోగలాలసుడైన "బల్లాణరాయుడు” ముమ్మక్కదేవి అందచందాలను కన్నులారాచూశాడు. పరవశుడయ్యాడు. అతని మనస్సులో దుర్బద్దిచోటు చేసుకుంది. అతనిని ఎవరూ గమనించలేదు. ముమ్మక్కదేవి దేవమాలను తీసుకొని రాగానే స్త్రీలందరూ ఆమాలను కండ్లకద్దుకున్నారు. నీవు చాలా గొప్ప అదృష్టవంతురాలవు గౌరిదేవి నిన్ను కనికరించింది అని పొగడసాగారు. అంతలోనే "శహబాష్" అంటూ “భళీ” కన్నుల పండుగగా ఉంది అన్న మగ గొంతు మాటలు బయటనుండి వినిపించాయి. స్త్రీలందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ముమ్మక్కదేవి కోపంతో ఎవడా తుచ్చుడు అతనికి అక్కాచెల్లెండ్రులేరా ఉద్యానవనంలో స్త్రీలుంటారని మగవారు రాకూడదని తెలియని మూర్ఖుడెవ్వడు అంటూ అరచింది. ఎవరానీచుడు చూసిరమ్మని చెలికత్తెను పంపింది. చెలికత్తె పరుగునపోయి చూచింది. ముమ్మక్కదేవి కేక విని వెనక్కు తిరిగి మెల్లగా వెళ్లిపోతున్న రాజును చూచిన చెలికత్తె ముమ్మక్కదేవితో చెప్పింది. చీ॥ కంచే చేనుమే యటమా? పోగాలము దాపురించిందని స్త్రీలందరూ తిట్టుకున్నారు.
భర్తయింటికి రాగానే విషయం చెప్పింది మల్లప్ప వడయల్ రాజుగారి మీదున్న గౌరవముతో భార్య మాటలను త్రోచి పుచ్చాడు ఆమె భర్త మీదున్న గౌరవముతో ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆరోజు రాత్రి కలలో గాజులు, బొట్టులేని ముఖంతో కన్నీరు కారుస్తూ గౌరీదేవి కనిపించింది.

బళ్లాలరాయుడికి ఆరాత్రి నిద్రపట్టలేదు. విదూషకుని పిలిపించుకొని ముమ్మక్కదే విని లోబరచుకునే ఉపాయము చెప్పమన్నా ఆమె మహామంత్రి బార్య ఉత్తమ ఇల్లాలు మహాపతివ్రత నీఆలోచన మంచిది కాదని సలహా యిచ్చాడు కాని కామంతో కళు ఎమూసుకుపోయిన రాజుకు అతని మాటలు చెవికెక్కలేదు విదూషకుడు రాజు మాట కాదనలేక ఏవేవో ఉపాయాలు చెప్పాడు.

గౌరీవ్రతము జరిపిన మరునాటిరోజు మదన గోపాలపూజలు పురుషులు చేస్తారు. మదనగోపాల పూజ : పురుషులు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దీపాలు పెట్టే వేళకు స్నానాలు చేసి వారే వంట చేస్తారు తర్వాత శ్రీకృష్ణుని పటానికి పూజలు చేసి ప్రసాదాలు పెట్టి తర్వాత బోజనాలు చేస్తారు. ఆరోజు రాత్రి తమ భార్యలతో సంతోషంగా కాలం గడుపుతారు, తర్వాత కొన్ని రోజులకు బల్లాలరాజు చెలికత్తెల ద్వారా సాదువుల వేషాలు ద్వారా నీకు రాణి యోగముందని నిన్ను రాణిని చేస్తానని చెప్పి ఉమ్మక్కను లొంగదీసుకోడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ముమ్మక్కలో ఓర్పునశించి భర్తతో చెప్పింది. మల్లప్ప రాజును కలిసి నీదుర్బుద్ధిని వదులుకోమని హెచ్చరించాడు. రాజు తనకేమి తెలియదని నటించాడు, తర్వాత ఎట్లయినా ఉమ్మక్కను దక్కించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.

కొన్నాళ్ల తర్వాత సింధూర కటకం కొండల్లో దొంగలు దాగి దాడి దారి దోపిడీలు చేస్తూ ఎదిరించిన వారిని చంపుతూ నానాభీభత్సవము చేస్తుంటారు అది సాకుగా తీసుకొని రాజు మహామంత్రి మల్లప్ప వడయార్ని ఆ దొంగల దౌర్జన్యాలను అరికట్టమని పంపిస్తాడు. బల్లాలరాజు కొందరిని మారు వేషాలలో రాజు తన మనుషులను పంపి వెనుక వైపుగా దాడిచేసి మల్లప్ప మంత్రిని చంపివేస్తారు. ఆవిషయం తెలిసిన ఉమ్మక్కదేవి విలవిలలాడుతుంది. మహామంత్రి మంచివాడని ఆయనకు ఇలాంటి గతి పట్టినందుకు

ప్రజలు చాలా చింతించారు. బంధువులందరూ చాలా దుఃఖించారు. అదేరోజు అర్ధరాత్రి బల్లాలరాయుడు ఉమ్మక్క అంతఃపురములో ప్రవేశించి బలాత్కారము చేస్తాడు. మద్యంమత్తులో ఉన్న రాజును తలపై కర్రతో కొట్టి తలుపు గడియ తీసుకొని తప్పించుకొని మరలా బయట గడియపెట్టి కత్తి తీసుకొని గుర్రము పైకెక్కి తనకు నమ్మకస్థులైన ఇద్దరు సైనికులను తీసుకొని తనకు అడ్డం వచ్చిన వారిని నరుకుతూ సిందూరకటకము నుండి నేటి ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామం చేరుకుంది. గోనుగుంట గ్రామములో ఆ సమయంలో విజయదశమి నవరాత్రులు జరుగుతున్నాయి. ఆమె చింపిరి జుట్టుతో మాసిన బట్టలతో గుర్రంపై నుండి దిగి బిగ్గరగా అరుస్తూ పాకనాటి బలిజలకు పౌరుషం చచ్చిందా? నాజాతి ఇంతపిరికి జాతా? అంటూ అరుస్తూ "బలిజ సింహాసము” (అనగా 18 కులాలకు తీర్పు చెప్పే ప్రదేశం మరియు సైనికులను చేర్చుకొని వారికి యుద్ధ విద్యలు నేర్పే ప్రదేశం) వద్దకు వచ్చింది. ఆ అరపులకు గ్రామ ప్రజలందరూ చుట్టూ మూగారు ఆమెను గుర్తించారు. వారింటికి తీసుకెళ్లారు. ఆమె జరిగిన సంగతులన్నీ చెప్పి “నాకు వాడితలకావాలని పట్టు బట్టింది” యువకులంతా బిగ్గరగా అరుస్తూ వాడి తల తెస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉమ్మక్కదేవి ప్రక్కన ఉన్న రాయి తీసుకొని నుదురుపై కొట్టుకొని కారే రక్తముతో యువకులందరికి వీర తిలకం దిద్దింది.

కాని వారిలో ఒక వృద్ధుడు వారిని శాంతపరచి యువకులారా దీనికి కావలిసింది భుజబలము, పౌరుషము ఒక్కటే చాలదు బుద్ధిబలము కూడా కావాలి! ఒక రాజు తల తేవాలంటే అంత సులభం కాదు. అతని అంగబలము, ఆర్ధికబలముంది కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి! ఆమెతోటి వచ్చిన అనుచరులు ఇద్దరిని తీసుకొని నలుగురుయువకులు బయలుదేరి సింధూరకటకం వెళ్లండి అక్కడరాజుగారి యింటి మంగలిని వశపరుచుకొని చాకలిని కలిసి వశపరుచుకొని వారి బంధువులుగా ప్రవేశించి రాజుకు మత్తు మందు కలిపిన నూనెను తలకు మాలిష్ చేస్తూ మత్తులోకి జారుకున్నపుడు తలకోసుకొని చాకలి బట్టల మూటలో వేసుకొని అంతఃపురము భయటకు వచ్చి గుర్రాలు ఎక్కి గోనుగుంట్ల గ్రామము చేరుకోవాలి అదేవిధంగా చేసినారు. ఆ యువకులు గోనుగుంట గ్రామం చేరుకొని తర్వాత వాడి తలను కాళ్లతో తన్నుతూ ఒక శూలానికి గ్రుచ్చి ఊరేగించారు. (అందువలన గోనుగుంట బలిజలకు "బల్లాల రాయ శిరఃఖండనా వినోదులు” అని బిరుదు కలదు.) అది చూచిన ఉమ్మక్క దేవి చాలా సంతోషించింది. ఎవ్వరు చెప్పినా వినకుండా పుట్టింటి వారిని అగ్నిగుండము ఏర్పాటు చేయమంది అగ్ని గుండం ఏర్పాటు చేశారు. అగ్ని ప్రవేశంనకు ముందుగా ఆమె గ్రామ ప్రజలకు, కులస్థులకు పాకనాటి బలిజలారా! మీరు ధాస్యము చేయకండి. ఐకమత్యంగా జీవించండి. మీ చెల్లిని మరువకండి. నన్నుస్మరిస్తే ఎప్పుడూ మీకు సాయంగా ఉంటానని చెప్పి అగ్ని ప్రవేశం చేసింది. ఆనాటి నుండి గోనుగుంట బలిజలు ఎవరి వద్ద ఉద్యోగములు చేయుటకు ఇష్టపడరు. చిన్నదైనా, పెద్దదైనా వ్యాపారము చేయుటకు ఇష్టపడతారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా వారిలో చాలా కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇష్టపడేవారు కాదు తర్వాత ఇప్పుడు కొందరు ఉద్యోగాలు చేస్తూ యున్నారు. వారిలో ఎక్కువగా వ్యవసాయము నవరాత్నాల వ్యాపారము, గాజులు వ్యాపారము, ధనవంతులు రత్నాలు, వజ్రాలు వ్యాపారము చేసెడివారు.

గోనుగుంట గ్రామములోని శివాలయము లక్ష్మీనరసింహ దేవాలయ శాసనాల ఆధారంగా దాదాపు 1500 సం॥ పూర్వమే గ్రామము ఏర్పడినదని తెలుస్తుంది. భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో చాలా మంది మేము గోనుగుంట బలిజలమని చెప్పుకుంటారు. వారి వ్యాపారము బంగారు నగలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, నవరత్నాలు, బట్టలు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. వీరి వంశీయులే రాజుల బలిజ కులస్తుడైన చెన్నమ నాయకుడి కుటుంభీకులు మధుర రాజులు కశ్యప గోత్రీయులు.

గోనుగుంట గ్రామ వీరభద్రస్వామి దేవాలయమందు రాతి శాసనం 1510 అక్టోబరు 13వ తేది సోమవారం శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని పాలిస్తున్నపుడు కొండవీటి సీమ పాలకుడు తిమ్మరుసు అమ్మనబ్రోలు సీమలోని గోనుగుంట గ్రామము అమరేశ్వరస్వామికి పొలందానం చేశాడు. మరొక శాసనం 1215 సం॥ వేసినది. గ్రామములో తిరునాళ్ల సందర్భముగా శివాలయము నుండి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆపి మరలా వెళ్ళే సాంప్రదాయముంది కాబట్టి శివాలయము కంటే పూర్వమే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నిర్మించినట్లు తెలుస్తుంది. గోనుగుంట బలిజలు లక్ష్మీ నరసింహస్వామిని తమ కులదైవంగా భావించి పూజిస్తారు. వీర క్షత్రియ) బలిజ శాసనములలో "బల్లాలరాయ శిరఃఖండనా వినోదులు" అని గోనుగుంట బలిజలకు బిరుదు కలదు. కాకతీయ మాధవ వర్మ కటక బల్లాలరాయుని చంపి “బల్లాల రాయతలగొండు గండ" బిరుదు ధరించారు. అతని వంశీయులే గోనుగుంట బలిజలని చరిత్ర కారులు ప్రతిపాదించారు.

Post a Comment

Previous Post Next Post