పద్మశ్రీ , కళానిధి ద్వారం వెంకట స్వామి నాయుడు
తెలియలేదు రామా భక్తిమార్గములు" అన్నారు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు.అదేమిటి నిరంతర రామ నామ ధ్యానం తప్ప ఇంకేమీ తెలియని వారికి భక్తిమార్గములు తెలియవా అనుకోకండి...తెలియనిది ఆయనకి కాదు మనకి అని వారు బాధ పడ్డారు....మనం ఈ లౌకిక జీవితమే శాశ్వతం అన్న బ్రహ్మ లో పడి బాధలు అనుభవిస్తూ ఉంటే అప్పుడు వారన్నమాటే ఆ పాట..కాని కొందరు జన్మతః ఈ జీవితం తృణ ప్రాయమైనది ఇక్కడ ఉండి అధమపురుషులకు సేవలు చేసే కన్నా ఎప్పటికైనా చేరుకోవలసినది ఆ పురుషోత్తముడైన పరమాత్మనే అని తెలుసుకుంటారు..ఆ ఎరుక కూడా వారికి భగవంతుడే కలిగిస్తాడు....కారణం వారు కారణ జన్ములు కాబట్టి.. వారు పుట్టినప్పటినుండీ తనువును వీడే వరకు ఆ పరమాత్ముని సేవలోనే జీవించితరిస్తారు...ఇక్కడ పరమాత్ముని సేవ అంటే..అది ఏరకంగానైనా కావచ్చు..సుస్వర సాధనలోనే తమజీవితాన్ని సార్ధకం చేసుకున్న వాగ్గేయకారులు అందరికన్నా ఎక్కువగా ఆ పరమాత్మునితో సన్నిహితంగా మెలగగలుగుతారన్నది చరిత్ర మనకు చాటి చెప్పిన అక్షర సత్యం...
అలాంటి కారణ జన్ములలో ఒకరు అనితర సాధ్యమైన , అపురూపమైన వయొలిన్ సోలోను సృష్టించి పండిత పామర రసికులకు దశాబ్దాలపాటు సునాదబోధ చేసిన నాదసిద్ధులు, వైకుంఠ సప్త"ద్వారాలను" తన వాయులీనముపై సప్తస్వరాలుగా మార్చి తన వాయులీన విన్యాసంతో ఆ సప్తద్వారాలను మన చేత దాటించి మనకి తన దర్శన భాగ్యం కలిగించడానికి వచ్చిన “వెంకటస్వామి” వేరెవరో కాదు కీ.శే.శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు.
నవంబర్ 8, 1893 భారతదేశ సంగీతచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు, ఆరోజు దీపావళి అమావాస్య. కానీ సంగీతప్రపంచానికి మాత్రం ఆరోజే కార్తీకపౌర్ణమి. ఎందుకంటే ఆరోజే వాయులీన వాయిద్యంలో తనజీవితాన్ని విలీనం చేసిన శ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు గారు జన్మించారు.
అసలు ద్వారం వారందరూ కూడా సప్తస్వరనిలయమైన సంగీతజ్ఞుల కుటుంబం యొక్క ఇంటి ద్వారాలు అనుటలో ఎటువంటి అతిసయోక్తిలేదు. అందుకే విద్యలకు,కళలకు కణాచి అయిన విజయనగరం లో అయిదు తరాలుగా వారింట శారదామాత కొలువై నాదనీరాజనాలు అందుకొంటున్నది.
శ్రీ వెంకటస్వామి నాయుడు గారి తండ్రి(సుబేదార్ మేజర్ వెంకటరాయలు) తాత(సుబేదార్ మేజర్ శ్రీవెంకటస్వామి) ఇద్దరూ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో పని చేసినవారు. వీరు కూడా వయొలిన్ వాయించే వారు.కానీ వారి వాయిద్యం రామాలయాలలో భజనలవరకే పరిమితం అయ్యింది.ద్వారం వెంకటరాయలుగారికి అయిదుగురు సంతానం.ఇందులో పెద్దవారు ద్వారం వెంకటకృష్ణ రాయలు,1876లో జన్మించారు.ఈయన కూడా వయొలిన్ విద్వాంసులే.తరువాత ముగ్గురుపిల్లల తరువాత వారు మన ద్వారం వెంకటస్వామినాయుడు గారు.వీరు సంతానం లో ఆఖరి వారైనా సుస్వర జ్ఞానంలో ప్రథములే మరి.
అసలు ద్వారం వారి వంశంలో వయొలిన్ వాయిద్యం ఒక సాంప్రదాయం గా నెలకొనడానికి మూలపురుషుడు శ్రీ ద్వారం వెంకటకృష్ణ నాయుడు గారే.ఈయన తన వంశం లో మూడు తరాలవారికి వాయిద్య నైపుణ్యం,విద్యా రహస్యాలు,నాదయోగ సాధన బోధించి,తాను స్వయంగా సాధకుడై ఆదర్శంగా నిలిచి,తన వంశంలో వేయి పున్నముల వెన్నెల వెలుగును నింపిన తపస్వి.ఇక మన ద్వారం వెంకటస్వామి నాయిడు గారు ఈ వెంకటకృష్ణ నాయిడు గారి కనిష్ఠ సహోదరులు.
మన వెంకటస్వామి నాయుడుగారు ఓ బంగారపు తీగాయితే ఆయనను ఓ చక్కటి ఆభరణం గా మలిచిన వ్యక్తి ,శక్తి కూడా అన్నగారైనటువంటి ఈ వెంకట కృష్ణ నాయుడుగారే. వెంకటకృష్ణయ్య నాయుడు గారు తమ్ముని ప్రతిభను చిన్న నాడే గుర్తించి వారి భవిష్యత్తు తీర్చి దిద్దడానికే కంకణం కట్టుకున్నారు. అదే తన జీవిత లక్ష్యం గా పెట్టుకున్నారు.
తమ్ముడికి సంగీత ఓనమాల దగ్గరనుండీ వర్ణాలు,కీర్తనల వరకూ అన్ని దగ్గరుండి నేర్పారు.తన గురువులైన నందిగామ వెంకన్న పంతులుగారికి పక్క వాయిద్యం వాయింపజేసి ఆశీస్సులు కూడాఇప్పించారు.నందిగామ వెంకన్న పంతులుగారంటే వీణ,గాత్రంలో మేరు పర్వతం అంత పెద్ద విద్వాంసులు,కసింకోట సంస్థాన విద్వాంసులు.
ఇంకా పిఠాపురం సంస్థాన విద్వాంసులు అయినటువంటి తుమరాడ సంగమేశ్వర శాస్త్రి దగ్గరకు తీసుకు వెళుతూ వారి వాయిద్యం వినిపించి వారితో కలిసి సాధన చేయించేవారు.తమ్ముడినికాకినాడ,మద్రాసు వంటి గాన సభలకు తీసుకువెళ్ళి గోవింద స్వామి పిళ్ళై,వీణా ధనమ్మాళ్ వంటి వారి సంగీతాన్ని వినిపించేవారు.తాను దొరల వద్ద నేర్చుకున్న పాశ్చాత్య సంగీతాన్ని నొటేషన్ తో సహా తముడికి నేర్పేవారు.తమ్ముడలా చిన్నతనంలోనే కఠోర సాధన తో ఎదగడం చూసి అమితానందం చెందేవారు.ఎవరు ఎంత బాగా పాడినా,వాయించినా కూడా తమ్ముడంటే ప్రత్యేకమైన ప్రేమ,వాత్సల్యం.తమ్ముడి ప్రతిభ యందు ప్రత్యేకమైన గౌరవం.ఇంతంటి పాండిత్యము,వాత్సల్యము కలిగిన సద్గురువు,సత్పురుషుడు అయిన వెంకటకృష్ణయ్య గారు కు తమ్మునిగా పుట్టడం మన వెంకటస్వామి నాయుడు గారి అదృష్టం కాదా మరి.
ఈవిధంగా 14సంవత్సరాల వయసు వచ్చేసేరికి అపారమైన సంగీత ప్రతిభ ని కనపరుస్తూ పెద్ద పెద్ద విద్వాంసులకు పక్క వాయిద్యకుడిగా కచేరీలు సైతం చేసేవారట.ఓసారి మారేపల్లి రామచంద్రరావు అనే గొప్ప విమర్శకులు ఈయన వయొలిన్ వాయించడం విని,మైమరచిపోయి తన చేతికి ఉన్న వజ్రపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చివేసి వెంకటస్వామి నాయుడుగారికి ఫిడేల్ నాయుడు అని పేరు కూడా పెట్టేసారు.ఆ మహానుభావుడు ఎంత మంచి సంకల్పంతో ఆయనకు ఆ పేరు పెట్టారో కానీ అది సార్ధక నామధేయం అయ్యింది.
పదకొండు సంవత్సరాలు రోజుకి ఎనిమిది గంటలు కఠోర సాధన చేసి వయొలిన్ కే సంగీతం చెప్పగలిగిన ఎత్తుకి ఎదిగి 1919వ సంవత్సరంలో విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఇంకానేర్చుకోవాలన్న జిజ్ఞాశతో ప్రవేశపరీక్ష రాయడానికి వెళ్ళారుట.అప్పుడు కళాశాల ప్రధానోపాధ్యాయులుగా హరికథా పితామహులు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు ఉండేవారు.ఆయన మన వెంకటస్వామి నాయుడుగారి అపార ప్రతిభా పాఠవాలకి ఆశ్చర్యచకితులై వారికి కళాశాలలోఆచార్యులుగా పదవిని ప్రధానం చేసారు.ఈ సంఘటన జరిగేనాటికి నాయుడుగారి వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.ఇకఅప్పటినుంచీ విజయనగరం కళాశాలలో ఆచార్యులుగా పనిచేసిన వారు 1936లో నారాయణదాసు గారు పదవీ విరమణ చేసాక అదే కళాశాలకు ప్రధానోపాధ్యాయులుగా నియమింపబడ్డారు.
సంగీతం "వినిపించే తపస్స" అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఇతను శిష్యులకు చెప్పేవారు. – “ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి” - అని చెప్పేవారు.
విజయనగరం కళాశాలలో వీరు పని చేస్తున్న సమయం లో ఎందరో శిష్య ప్రశిష్యులకు చక్కటి సంగీతాన్ని నేర్పి వారిని విద్వాంసులుగా తీర్చి దిద్దారు.వారిలో ప్రముఖులు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు,పి.సుశీలకలైమామణి శ్రీమతి ఆర్.రాధానారాయణన్, వీరి కుమారులైన ద్వారం భావనారాయణ రావు,అన్నగారి కుమారులైన ద్వారం నరసింగరావు వంటి వారు.
అసలు వయొలిన్ మన భారతదేశానికి బ్రిటీషు వారు రానంతవరకూ ఓ అపరిచిత వాయిద్యం.వారు వచ్చాక దొరలదగ్గరనుండీ దాన్ని మన సంగీతానికి చేర్చిన వారిలో ప్రథములు ముత్తుస్వామి దీక్షితుల వారి సహోదరులైనటువంటి శ్రీ బాలస్వామి దీక్షితుల వారు(1786-1859). ఆ తరువాత ఈ వాయిద్యం పై కృషి చేసిన వారు శ్రీ తిరుక్కోడి కావల్ కృష్ణ అయ్యర్,శ్రీ గోవింద స్వామి పిళ్ళై మొదలైన వారు.ఇక ఆ తరువాత కొన్నాళ్ళు ఇది అపస్వర వాయిద్యమని , నిరాధర వాయిద్యమని పలు విద్వాంసులచేత తృణీకరించబడిన సమయంలో వయొలిన్ ను తన సొంతం చేసుకుని...తానే ఫిడేలై,ఫిడేలే తానై భగవత్ కృపతో,అసాధారణ నాద జ్ఞానంతో, అన్నగారి ఆశీర్వాదానుగ్రహంతో , అచంచలమైన తపోదీక్షతో,ఏళ్ళతరబడి తన కమానుతో సప్తస్వరాలను కమాన్ అని ఆవాహనం చేసి తన వాదనా విన్యాసాలతో శ్రోతలకు సంగీతామృతపానం చేయించిన పుంభావ సరస్వతీమూర్తులు శ్రీ వెంకటస్వామి నాయుడు గారు.
అంతవరకు పక్కవాయిద్యం గా మాత్రమే స్వీకరించబడిన వయొలిన్ తో మొట్టమొదటి సారిగా సోలో కచేరీలు చేసిన ఘనత మన వెంకటస్వామి నాయిడుగారిదే.
1938లో వెల్లూర్ లో తన మొట్టమొదటి సోలో కచేరీ వాయించారు.శాస్త్రీయ,పాశ్చాత్య సంగీత ప్రక్రియలన్నీ తన కఠోర సాధనతో
రవివర్మ చిత్రాలు చూడగానే మనసు ఎంత ఆనందం గా పరవశిస్తుందో వారి వయొలిన్ వాదన వింటే అంత రసానుభూతి పొందుతుందని ఆ రోజుల్లో పెద్దలందరూ చెప్పేవారట.ఓ సారి కాకినాడ సరస్వతీ గాన సభకి ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు గోవిందస్వామి పిళ్ళై గారిని పిలిచారట..ఆయన అప్పుడు రాలేని స్థితిలో ఉన్నారట. అప్పుడు ఆయన తన బదులుగా వెంకటస్వామి నాయుడిగారితో కచేరీ జరిపించమన్నారంటే వారి విద్వత్ ఎట్టిదో మనకు తేట తెల్లం అవుతుంది.
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఓసారి తన పర్యటనలో భాగంగా వీరి సంగీతం వినవలసి వచ్చినప్పుడు ఎక్కువ సమయం లేనందున కొద్ది క్షణాలు మాత్రమే గడిపి వెళ్తాను అన్నారుట.కాని మన వెంకటస్వామి నాయుడు గారు వాయించడం ప్రారంభించాక..ఎంతసేపు గడిచిందో కూడా తెలియకుండా విని వారితో కలిసి పాడి మరీ పులకించిపోయారుట.
20వ శతాబ్దపు విశ్వవిఖ్యాత వయొలినిష్టులలో ఒకరైన యెహూది మెనుహిన్ ఓసారి భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకి మన నాయుడుగారి గురించి చెప్పారుట.ఆయన మహవిద్వాంసులని తెలీక ఆయనకి నా వయొలిన్ ని చూసే అర్హత లేదన్నారుట.నాయుడిగారి వయొలిన్ వాదన విన్నాక కళ్ళనీళ్ళ పర్యంతం తన వయొలిన్ వారికి ఇచ్చి ఇది వాయించడానికి మీరే అర్హులని అభినందించారుట.ఈ ఒక్క సంఘటన చాలు వారు ఎంత ప్రతిభావంతులో మనం తెలుసుకోవడానికి.
వారి సమకాలీనులైన టి.ఎల్ వెంకట్రామ అయ్యర్,టి.వి.సుబ్బారావు,టి.సాంబమూర్తి,సెమ్మంగూడి శ్రీనివాస అయ్యంగార్, తిరుకోడికావల్ కృష్ణ అయ్యర్ వంటి విద్వాంసులందరి చేత ప్రశంసలు పొందిన పుంభావ సరస్వతి.
వీరి ప్రతీ సోలో కచేరీ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్తగా ఆకట్టుకునేదిట, “తెలియలేదు రామ” అన్న ధేనుక రాగంలోని త్యాగరాజస్వామికృతి వీరు వాయిస్తున్నప్పుడల్లా వేదిక పై కొత్త కాంతులు ప్రజ్వలిస్తున్నట్లుగా ఉండేది అని సంగీతరసజ్ఞుల ప్రశంస.ఓసారి ఇలాంటి కచేరీ ని పూర్తిగా విన్న ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు, ట్రావెంకోర్ ఆస్థాన విద్వాంసులు అయిన శ్రీ కుంభక్కోణం రాజమాణిక్యం పిళ్ళై గారు కచేరీ అయ్యాక వారికి చేతులు జోడించి "నాయుడు గారు మేము పొట్టకూటికి వయొలిన్ వాయించుకుంటున్నాము మీరు సంగీతం కొరకు వాయిస్తున్నారుఅని ప్రశంసించారు”.
వీరు స్వర కల్పన చేస్తున్నప్పుడు వెనక మృదంగం వినిపిస్తొందా అన్నట్లుగా కమాన్ ను ఉపయోగించుట నాయుడు గారిమరో ప్రత్యేకత అని శ్రీ శ్రీపాద పిణాకపాణి గారు ఎన్నోసార్లు ఆయనను ఎన్నో సందర్భాలలో అభినందించారు.
విశ్వనాథ సత్యనారాయణ,జాషువా,బాలంత్రపు రజనీకాంతరావు,చళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వంటి కవులందరూ వీరి సంగీతం పై ఎన్నో పద్యాలు రాసి వీరిని వేయినోళ్ళ కీర్తించారు.
వీరు సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా రాసారు."తంబూరా విశిష్ట లక్షణాలు" అలాంటి వ్యాసాలలో ఒకటి.
ఇంతటి మహనీయులిని ఎన్నో పురస్కారాలు వరించి వాటి గౌరవాన్ని పెంచుకున్నాయి.
1941లో మద్రాస్ మ్యూసిక్ అకాడమీ వారు సంగీత కళానిధిని ఇచ్చి సత్కరించింది.
1941లోనే ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారు సంగీతకళాశిఖామణిబిరుదును
1950లో ఆంధ్రా విశ్వ విద్యాలయం వారిచే కళాప్రపూర్ణ
1952వ సంవత్సరంలో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలో జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనశాల ఆడిటొరియం లో ఈయన కచేరీ జరిగింది. ఈ కచేరీ కి ఎందరో ప్రముఖులు హాజరయ్యి తమ ఆత్మీయ అభినందనలు అందచేసారు.
1953లో సంగీత నాటక అకాడమీ అవార్డ్
1957లో భారత ప్రభుత్వం చే పద్మశ్రీ
1992లో - శ్రీ రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ వారిచే వారి అవార్డ్ ను శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టుకు బహూకరింపబడింది.
1993లో ఆతని శతజయంతి సందర్భంగా భారతీయ తపాలా శాఖవారు తపాలాబిళ్ళ కూడా విడుదల చేశారు.
చెన్నయ్ లో“శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలుప్రతిష్టింపబడ్డాయి.
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ ద్వారం భావనారాయణ రావు గారు వీరు కుమారులు.ఆయన కూడా తండ్రి గారి దగ్గరనుండి చక్కటి వయొలిన్ వాదనను వారసత్వం గా పొందినవారే.
ప్రక్కవిద్వాంసులుగా ఉన్నా లేక సోలో కచేరీచేసినా తన మనోధర్మాన్ని వీడక అపారప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించి వయొలిన్ వాయించడంలో "ఘనాపాటి"గా చరిత్రలో నిలిచిపోయారు.
ఇంత విద్య తనదగ్గర ఉన్నా "నేను విద్యాధికుడిని కాను,ధనాధికుడినీ కాను..నాదగ్గర ఏమీ లేదు ఉన్నదల్లా ఈ కర్ర ముక్కే..దీని ఆధారంగానే ఈ భవజలధిని దాటడానికి ప్రయత్నిస్తున్నాను" అనుకుంటూ ఎంతో వినయం గా మాట్లాడేవారు ఎనలేని సంగీతనిధి ఉన్న ఈ సంగీత కళానిధి .
కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కళను ప్రదర్శించడం కానీ కళాకారుడిని ప్రదర్శించడం కాదు అన్న సూక్తి ని గౌరవించడమే కాదు తనదైన శైలిలో ఆచరించి చూపిన గానతపస్వి కూడా మన శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు.
నాదోపాసనకే తన శక్తినీ, కాలాన్నీ,యావత్ జీవితాన్ని వ్యత్యించి 1964లో నవంబర్ 25వ తేదీన వారు కీర్తిశేషులై ఆ శారదా పదసన్నిధికి చేరి ఎనలేని కీర్తిని,ఎందరో ప్రఖ్యాత శిష్య ప్రశిష్యులను ఈ లోకానికి శేషం గా మిగిల్చారు. ‘‘మనమింతగా నారాధించు కళ నవనవోన్మేషమును బొందవలయును. ప్రాత దుస్తుల తోడను,ప్రాచీనాలంకారముల తోడను మాత్రమే మన కళా సరస్వతిని నిలుపగోరము.’’‘ఫిడేలు నాయుడు’ పేరుతో కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో సుప్రసిద్ధులయిన ద్వారం వెంకటస్వామినాయుడు పలికిన మాటలివి. ఏ కళ అయినా పరిణామం వైపే పరుగులు తీస్తుంది. ఎల్లలు లేని సంగీతానికి అది మరింతగా వర్తిస్తుంది. బహుశా విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రధాన ఆచార్యులుగా పదవీ స్వీకారం చేసిన సందర్భం కావచ్చు. ఆయన పలికిన మాటలు చిరస్మరణీయాలనిపిస్తూ ఉంటాయి. పైన ఉదహరించిన మాటలు కూడా ఆనాటి ఉపన్యాసం లోనివే. ద్వారం వెంకటస్వామినాయుడుగారు (నవంబర్ 8, 1893 – నవంబర్ 25, 1964) బెంగళూరులో పుట్టారు. కంటోన్మెంట్ మిలటరీ క్వార్టర్స్‌లో ఆ సంగీతనిధి కళ్లు తెరిచారు. అది కూడా దీపావళి అమావాస్య రోజున. తండ్రి మేజర్ వెంకటరాయలు. తల్లి లక్ష్మీనరసమ్మ. వెంకటరాయలు తండ్రి వెంకటస్వామి. ఆయన కూడా సైన్యంలో పనిచేసిన వారే. ఆయన పేరే వెంకటరాయలు కుమారుడికి పెట్టుకున్నారు. నిజానికి వారి కుటుంబంలో చాలామంది కశింకోట సంస్థానాధీశుని దగ్గర సైన్యంలో పనిచేసిన వారే. స్వస్థలం కూడా అదే.ఫిడేలు నాయుడుగారు తుపాకీ పట్టకుండా కమాను పట్టుకునేటట్టు చేసినవి రెండు. ఒకటి... ఆ కుటుంబ పెద్దల మారిన దృష్టి. రెండు... వెంకటస్వామినాయుడు పోగొట్టుకున్న దృష్టి. పూర్వం భారతీయ ప్రభువుల దగ్గర సేవ చేశారు. కానీ బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన తరువాత ప్రభువులు మారిపోయారు. పరదేశ ప్రభువుల ఆదేశాలతో సాటి భారతీయుల మీద తుపాకీ ఎత్తవలసి వస్తోంది. అందుకే వెంకటరాయలు ఆత్మగౌరవం కలిగిన వృత్తులలో తన సంతానం ఉండాలని కోరుకున్నారు. వారిని బడికి పంపారు. కానీ వెంకటస్వామి నాలుగో క్లాసుకు వచ్చేసరికి తండ్రి పదవీ విరమణ చేసి, కశింకోటకు చేరుకున్నారు. దానితో వెంటకస్వామిని విశాఖలోని ఏవీయన్ విద్యాసంస్థలో చేర్చారు. క్రమంగా చూపులో మార్పు వచ్చింది. నల్లటి బోర్డు మీద అక్షరాలు అతుక్కుపోయి కనిపించేవి. అంతా అయోమయంగా ఉండేది. చివరికి బోధకులు వెంకటస్వామిని సంస్థ నుంచి పంపించేశారు.
అప్పటికే రైల్వేశాఖలో కుదురుకున్న అన్నలు ఇద్దరూ వెంకటస్వామిని ఓదార్చారు. తండ్రి నేర్పించిన వయొలిన్ వాద్యాన్ని తమ్ముడికి నేర్పడం ఆరంభించారు. ఆ సోదరులిద్దరిదీ వానాకాలం వాద్యవిద్య కాదు. ఒకరు మద్రాస్‌లో పట్నం సుబ్రహ్మణ్యన్ అయ్యర్ అంతటి పండితుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. మరొక సోదరుడు రైల్వే ఉన్నతాధికారి ఒకరి దగ్గర పాశ్చాత్య వయొలిన్ సంగీతం నేర్చుకున్నారు. ఆ అన్నలిద్దరూ తమ్ముడికి తమకు తెలిసినదంతా నేర్పించారు.1919లో విజయనగరం రాజా సంగీత కళాశాలను నెలకొల్పారు. తొలి ప్రధాన ఆచార్యులు శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష జరిగింది. వెంకటస్వామినాయుడిని కూడా తీసుకువెళ్లారు. అది ఆయన జీవితాన్ని మార్చింది. సంస్థానాధీశుడు విజయరామగజపతితో పరిచయం కలిగింది ఆ సందర్భంలోనే. రాజావారు వెంకటస్వామిని కూడా సంగీత కళాశాల ఆచార్యులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.శిల్పం, చిత్రలేఖనం కాలం మీద సంతకం చేసి వెళతాయి. ఏ సంగీతజ్ఞుడి ప్రతిభకైనా ఆ లక్షణం ఉండదు. శిష్యులు, ప్రశిష్యుల పరంపరలో, వారి శైలిలో దాని జాడను అన్వేషించవలసిందే. ఫిడేలు నాయుడుగారి విషయంలో మాత్రం కొందరు తమ అనుభవాలను నమోదు చేశారు. వి. తిరుపతి అనే ఆయన రాసిన సంగతులు చూడండి: ‘‘వారానికి కనీసం అయిదు రోజులైనా ప్రతీ సాయంత్రం సంజ వాలిన కొద్దిసేపటికి ఆ మహా విద్వాంసుడు తన ఇంట్లో ఒక లేడి చర్మం మీద కూర్చొని ఫిడేలు పట్టుకుంటారు. ఆ గదిలో ఒక దీపం మెల్లగా వెలుగుతూ ఉంటుంది. ఊదువత్తులు అగరు వాసనలతో మెత్తగా గది గుబాళిస్తూ ఉంటుంది. నాయుడుగారు నిదానంగా గంభీరంగా తన నాదోపాసనకు పూనుకుంటారు. అక్కడ చేరిన వాళ్లలో శ్రీమంతులు, చిరుపేదలు ఉంటారు. అక్కడ జాతిమత భేదాలు లేవు. చిన్నాపెద్దా, ఆడామగ తేడాలు లేవు. పిలిచారా పిలవలేదా అనుకోరు’’.