కీలక రాజకీయ సామాజిక చరిత్రకు ఆనవాలుగా నిలవబడిన 1444 నాటి ద్రాక్షారామ శాసనం.
శాసనం:
"స్వస్తి శ్రీ శక వరుషంబులు 1366 అగు రక్తాక్షి సంవత్సర మాఖ శు 5 గు శ్రీమన్మహామండలేశ్వర రాజాధిరాజ శ్రీ వీర ప్రతాప ప్రవుడదేవరాయ మహాప్రధాన రాజమహేంద్రపురవరాధీశ నాగభూపాల పుత్ర కోటిశంకర బిరుదాంకిత మూడురాయరగండ మల్లెభూపాలశేఖర నిజహిత శ్రీమత్ పులియమార్కోలుగండ పంచములగోత్ర పెద్దినాయకమ్మారమాంబికాపుత్ర దేవాంబికా మనఃకమలమిత్ర బలంజెధర్మప్రతిపాలకుండై పృథ్వీసెట్టింగారైన అంక్కతెలుంగరిసెట్టింగారున్నూ ఎండపి రాయవరం నడిమి పదనకొండు వగల పెక్కండ్రున్నూ దాక్షారామం నానాదేశ తిరువాకిటినున్న పెక్కండ్రకు యిచ్చిన ధర్మ శాసనము మీరు భీమేశ్వరుని ఊలిగము సేసేరు గాన మీకును భీమేశ్వరుండున్నూ సూర్య చంద్రులున్నూ కలకాలము రాచకార్య బలంజెకార్య నిమిత్తమయిన బలంజేవారిలోని విరాళంపన్ను దాక్షారామ గుహావితత్సంవత్సర సంక్రమాణ పుణ్యకాలానను మల్లప్పఒడయలుంగారికి పుణ్యంగాను సర్వమాన్యం శేశితిమి గాన ఈమరియాదను . ... .. .... .. .. ఈ దాక్షారామా బలంజె వారికి ఇచ్చిన ప్రకారాననే దేవర ఊళ్లు అవసరాల వేమవరం, వీరారెడ్డి నాగవరం, నల్లూరు, పొంకలగ్రుడ్డ, అల్లాడ్రెడ్డి వేమవరం, వల్లూరి అంశం, అవిడి తుని, సిరి మామిడాడ, విజయరాయ భీమవరం, గ్రామాలను స్వామికి దానంగా ఇచ్చితిమి."
ఈ శాసనమునకు వివరణ :
ఈ శాసనం స్వస్తి శ్రీ శక వరుషంబులు 1366 అగు రక్తాక్షి సంవత్సర మాఖ శుద్ద 5 గురువారం (అనగా క్రీస్తు శకం 1444లో) వేయబడినది.
అప్పటికి విజయనగర మహాసామ్రాజ్యాన్ని కర్ణాటకలోని హంపి విజయనగరం కేంద్రంగా సంగమ వంశ చక్రవర్తి శ్రీమన్మహామండలేశ్వర రాజాధిరాజ శ్రీ వీర ప్రతాప ప్రవుడదేవరాయలు (2వ దేవారాయలు) పరిపాలిస్తున్నారు.
ఈతని కాలంలో ప్రస్తుత గోదావరి జిల్లాల ప్రాంతమైన రాజమహేంద్రవరం రాజ్యాన్ని అల్లయ వేమారెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఈతని భార్య హరిహరాంబగారు - (ఈ హరిహరాంబగారు ఈ హంపి విజయనగరం సంగమ వంశ చక్రవర్తి గారైన 2వ హరిహరరాయల కుమార్తె అయిన విజయలక్ష్మీ కొండవీటి రెడ్డిరాజ్య సేనాని కాటయరెడ్డి గార్ల కుమార్తె. అనగా ఈ శాసనంలో పేర్కొనబడిన 2వ దేవరాయల గారి తండ్రి గారికి మేనత్తగారి కూతురే ఈ హరిహరాంబగారు. ఈ కాటయరెడ్డిగారు కొండవీటి రెడ్డిరాజైన అనవేమారెడ్డిగారి కుమర్తె అన్యమాంబా, కాటయ వేమారెడ్డి గార్ల కుమారుడు. ఈ కాటయ వేమారెడ్డిగారు కొండవీటి సేనాని, గొప్ప వీరుడు, ఈ కాటయ వేమారెడ్డి గారే మొదటిసారి రాజమహేంద్రవరం రాజ్యానికి పాలకుడైనారు).
ఈ బంధుత్వాలు రీత్యా సంగమ వంశ ఇమ్మడి దేవరాయలు ఈ రాజమహేంద్రవరం రెడ్డి రాజులకు బంధువులుగా ఉంటూ - రాచకొండ పద్మనాయకులూ, దేవరకొండ పద్మనాయకులూ, కళింగ గజపతి రాజుల నుండి నిత్యం జరుగుచున్న దాడులలో ఎదుర్కోవడానికి సైనిక సహకారాలు ఇస్తూ ప్రస్తుత గోదావరి జిల్లాల ప్రాంతమైన రాజమహేంద్రవరం రాజ్యాన్ని కాపాడుచూ ఉండేవారు.
ఆ క్రమములో దాడులు ఎక్కువవుటతో వచ్చి కాపాడమని కోరుకున్నప్పుడు 2వ దేవారాయలు హంపి విజయనగరం నుండి పెద్దమొత్తంలో సైన్యాలను పంపి కాపాడుచూ ఆ రాజమహేంద్రవరం రాజ్యాన్ని స్వాధీనం చేసుకొనెను. అప్పుడు హంపి విజయనగరం పెనుగొండ నుండి అనేక వీర బలిజ వంశీయులు సైనిక వ్యాపార వర్గాలుగా రాజమహేంద్ర రాజ్యం వెళ్లడం జరిగింది, వారిలో
2వ దేవారాయల విజయనగరం మహాసామ్రాజ్యం మహాప్రధానిగా ఉన్న రాజబంధువు నాగప్ప ఒడయారు గారు ఈతని కుమారుడైన మల్లప్ప ఒడయారు గారు, విజయనగరం మహాసామ్రాజ్యం పృథ్వీసెట్టి అంక్క తెలుంగరి సెట్టిగారూ, సమయ చక్రవర్తి శ్రీ పోలిశెట్టి కుమార సదాశివరాయశెట్టివర్మ గారు, సమయ సేనాపతులైన పగడాల రాచరాజుగారు, పెనుగొండ పర్వతరాజుగారు, దేశహిశెట్టి గౌరప్పశెట్టిగారు, కలిశెట్టి వీరిశెట్టివర్మగారు, మలిశెట్టి సిద్దయ్యశెట్టివర్మగారు, కంచి హంపాపతిరాయశెట్టివర్మగారు, పట్టపు శ్రీగిరిశెట్టివర్మగారు వంటి అనేక బలిజ కుల పెద్దలు రాజమహేంద్ర రాజ్యం చేరడం జరిగింది. ఈ బలిజ వంశీయులు తమ బలిజ సమయాల సైన్యాలతో, గజపతులను జయించి అనేక బిరుదులు పొందినారు.
2వ దేవారాయల మహాప్రధాని గా ఉన్న నాగప్ప ఒడయారు గారు రాజమహేంద్రపురవరాధీశునిగా నియమించబడినారు. ఈతని కుమారుడైన కోటిశంకర బిరుదాంకితులు, మూడురాయరగండ బిరుదాంకితులు అయిన మల్లప్పఒడయలుగారు. ఈతనికి అత్యంత సన్నిహితులైన బంధువులైన, శ్రీమత్ పులియమార్కోలుగండ బిరుదాంకితులైన పంచములగోత్రమునకు (వీరశైవ గోత్రం) చెందిన పెద్దినాయక మారమాంబికల కుమారుడైన
పృథ్వీసెట్టిగారైన అంక్క తెలుంగరి సెట్టిగారు ఈ 2వ దేవరాయల తోబుట్టువైన దేవాంబికా గారికి భర్త, ఈతను బలిజ ధర్మ ప్రతిపాలకుడు. ద్రాక్షారామ అనేది గొప్ప శైవక్షేత్రమే కాకుండా ఆనాటికి నాటికి దేశదేశాలలోనూ విశేష వర్తక వాణిజ్యాలను చేసే బలిజ కులస్తులకు ఈ రాజమహేంద్రవరం రాజ్య ప్రాంతంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ బలిజవారు కుబేరుని తలదన్నే సంపదలతో, గొప్ప గొప్ప కోటలు లాంటి భవనాలతో సకల వైభవాలను అనుభవిస్తూ ఈ ద్రాక్షారామాలో ఉండేవారు.యీ పృథ్వీసెట్టిగారైన అంక్క తెలుంగరి సెట్టిగారు మరియు ఈ రాజమహేంద్రవరం రాజ్యంలోని ఎండపి - రాయవరం అనే పట్టణాల మధ్యలో ఉండే 11 ప్రాంతాల బలిజ వర్తక వ్యాపారులు అందరూ కలిసి త్రిలింగ మహా పుణ్య క్షేత్రాలలో ఒకటైన ఈ దాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయంలో నానాదేశముల నుండి వచ్చే బలిజ వ్యాపారులు ఉండే దేవాలయ పవిత్ర ప్రదేశంలో ఉండే బలిజవారికి యిచ్చిన ధర్మ శాసనము - మీరు భీమేశ్వరునికి రకరకాల సేవలు చేస్తూ ఉన్నారు కావున మీకు ద్రాక్షారామ భీమేశ్వరుడూ సూర్య చంద్రులు ఉన్నంతకాలము - ఈ బలిజవారు, వివిధ రాజకీయ సంబంధమైన వ్యవహారాలకు, వర్తక వ్యాపార వాణిజ్య వ్యవహారాలకూ - ప్రభుత్వాలకు చెల్లించుకునే విరాళాల పన్నులను దాక్షారామ గుహావితత్సంవత్సర సంక్రమాణ పుణ్యకాలమున ఈ మల్లప్పఒడయలుగారికి పుణ్యంగా ద్రాక్షారామలో భీమేశ్వరునికి సేవలు చేసుకొనుచూ ఉన్న బలిజవారికి కలకాలం చెల్లించుకునే విధంగా ఆ పన్నులను దానంగా ఇచ్చినారు. అలాగే ఈ దాక్షారామా వర్తక వ్యాపారులైన బలిజవారికి ఇచ్చిన దాని ప్రకారంగానే - ద్రాక్షారామ భీమేశ్వరునికి = "1. అవసరాల వేమవరం, 2. వీరారెడ్డి నాగవరం, 3. నల్లూరు, 4. పొంకలగ్రుడ్డ, 5. అల్లాడరెడ్డి వేమవరం, 6. వల్లూరి అంశం, 7. అవిడి, 8. తుని, 9 సిరి మామిడాడ, 10. విజయరాయ, 11 భీమవరం అనే = 11 గ్రామాలను ఈ బలిజ వంశాల వారు ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారికి దానంగా ఇచ్చి ఈ శాసనము వేసినారు.
14వ శతాబ్దంనాటికి రాజమహేంద్రవరం రాజ్యం వచ్చిన ఈ కుటుంబాలలో అలా హంపీ పెనుగొండ ప్రాంతాలనుండి వచ్చిన శ్రీ పోలిశెట్టి కుమార సదాశివరాయశెట్టివర్మగారు, తరువాత ఈ రాజమహేంద్రవరం పాలకులుగా ఉండగా, తరువాత వీరి వంశీయులు రాజమహేంద్రవరం రాజ్యం దేశాయి సెట్లుగా, బలిజ మహానాటి సమయం పెద్దలుగా, ద్రాక్షారామ, కోరంగి వంటి పట్టణాలకు పట్టణస్వాములుగా ఉండేవారని, గొప్పగొప్ప వ్యాపారాలు చేసేవారని, షాహుకార్లుగా ఉండేవారని వీరి వంశ చరిత్రలు స్పష్టం చేస్తున్నాయి. ఈతని వంశీయులు గోదావరి జిల్లా ద్రాక్షారామలో స్థిరపడి గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తూ అక్కడినుండి పెద్దాపురం, వేమగిరి, గోలకొండ, బ్రహ్మపురి, పిఠాపురం, నాగపట్నం, తాళ్లరేవు, కాకినాడ, చల్లపల్లి, మచిలీపట్నం, చెన్నపట్నం, హైదరాబాద్, గూడాల, వ్యాగ్రేశ్వరం, ఉరధాల్లపాలెం, ఏనుగుపల్లి, గంటిపెదపూడి, తణుకు, సావరం, అత్తిలి, దేవగుప్తం రావులపాలెం, రాజమహేంద్రవరం, బోడసకుర్రు, సామంతకుర్రు, కొప్పర్రు, నరసాపురం, కరప, సుంకరపాలెం, కోరంగి, టి. కొత్తపల్లి, సలాదివారిపాలెం, ఉప్పూడి ఇరుమండ, దంగేరు, చినగాడవిల్లి, గురజాపులంక, తొత్తరముడి, ఉండూరు, సుభద్రంపేట, నంగవరం, వీరవల్లిపాలెం, పాలెపులంక, ఉప్పలగుప్తం, పెనుగుదురు, లచ్చిపాలెం, ధర్మవరం, కోలంక, లంకసీమ, యిరవ, తుని, సర్వసిద్ది రాయవరం, చెయ్యేరు, చాగల్లు, వంటి ప్రాంతాలలో 100 పైగా గ్రామాలలో విస్తరించి ఉన్నారు.
ఆనాటికి ఈ రాజమహేంద్రవరం రాజ్యంలో ఉండే బలిజ కుటుంబాలవారు గొప్ప గొప్ప వ్యాపారులుగా పేరుకెక్కినవారేకాక, గొప్ప యుద్ధవీరులు కూడా, వీరు విజయనగరమహాసామ్రాజ్యంలో గొప్ప గొప్ప రాచకార్యాలు నిర్వహించేవారు. తరువాత ఉత్తర సర్కారు జిల్లాలలో కళింగ గజపతులు, పూసపాటి విజయనగరం, పెద్దాపురం, పిఠాపురం సంస్థానాదీసులవద్దనూ, ఫ్రెంచి, బ్రిటిష్ వారి వద్దను సైన్యంలో సేవలందించేవారు. వీళ్ళే నేడు ఇక్కడ తెలగాలుగా మారి ఉన్నట్టు పెద్దలు చెపుతున్నారు. నేటికీ ఈ రాజమహేంద్రవరం రాజ్యం బలిజవారి సంతతులు రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో కూడా చాలా విస్తృతంగా విస్తరించి ఉన్నారు. వీరు నేటికీ తమ కులాన్ని రాజమహేంద్రవరం బలిజవారు అని తెలుపుకుంటారు.