మల్లయోధులు వస్తాదులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చేసే పనులను ఒక సామాన్యుడు అవలీలగా చేసి చూపించి వారితోనే 'భళిరా' అనిపించు కున్న ఉదంతమిది. గుర్రపుస్వారీతో పాటు పోటీకొస్తే ఎంత అసాధ్యమైన పనైనా సులువుగా చేయగలిగిన వ్యక్తి కథ ఇది. అప్పట్లో మల్లయుద్ధ వీరుడైన కోడి రామమూర్తిని సైతం అబ్బుర పరిచి శెభాష్ అనిపించుకున్న ఒక వీరయోధుడి గురించి నేటి తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనే సంగీత గంగరాజు. బ్రహ్మయ్య, తిరుపతమ్మల రెండవ సంతానమైన గంగరాజు తూర్పుగోదావరి జిల్లా కడియం దగ్గర మాధవ రాయుడు పేటలో 1890లో జన్మించారు. చిన్నతనం నుంచే చురుకుగా ఉండే గంగరాజు బలిష్ట శరీరంతో చూపరులను ఆకట్టుకునే రీతిలో ఉండేవారు. తన బలంతో అనేక అద్భుతాలు చేస్తూ ఆ గ్రామంలోనే కాకుండా చుట్టప్రక్కల గ్రామాలలో సైతం పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసే అద్భుతాలు చూడడానికి ప్రజలు ఆసక్తి చూపేవారంటే ఆయన శక్తి ఏపాటిదో అర్థమవుతుంది. ఆయన బలానికి మదమెక్కిన ఆంబోతు కూడా దాసోహం అవ్వాల్సిందే. ఇటువంటి సంఘటన ఒకటి తెలుసుకుందాం. గంగరాజు ఒకరోజు గుర్రపు బండిపై పనిమీద వెళుతున్నారు. మదమెక్కిన ఆంబోతు ఒక్కటి ఒక చిన్న పిల్లవాడ్ని తరుముకుంటూ వస్తోంది. పిల్లవాడు భయంతో పరుగులు తీస్తున్నాడు. పట్టణంలో అయినా అది పిల్లవాడ్ని పొట్టన పెట్టుకోవడం ఖాయం. ఆ సమయంలో గంగరాజు ఆ దృశ్యాన్ని చూశాడు. ఎలాగైన పిల్లవాడ్ని రక్షించాలనే నిర్ణయానికి వచ్చాడు. గభాలున గుర్రపు బండి దిగి ఆంబోతుకు అడ్డం వెళ్లాడు. ఆంబోతును తన రెండు చేతులతో నిలువరించి దాన్ని బలంగా పట్టుకున్నాడు. ఆంబోతు ఆయన కబంధ హస్తాల నుంచి తప్పించు కోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. మన గంగరాజు బలం ముందు దాని బలం నిలవలేదు. ఆయన బలానికి ఆంబోతు దాసోహ మవక తప్పలేదు. చివరికది తోక ముడుచుకుని తన దారిన తను వెళ్లిపోయింది. గంగరాజు బలం గురించి విన్నవారందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
బలంలోనే కాకుండా ఇటు అశ్వాన్ని అధిరోహించడంలో కూడా గంగరాజు దిట్ట. ఆయన గుర్రపు స్వామీ చేస్తున్న సమయంలో ఏవైనా వాగులు, వంకలు అడ్డం వస్తే వాటిని అవలీలగా గుర్రంతో సహా దూకగల దిట్ట మన గంగరాజు. ఇటువంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు. మల్లయోధులు, వస్తాదులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చేసే ఫీట్లను మన గంగరాజు అవలీలగా చేసి చూపించి ఆ వస్తాదులనే హడలెత్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏనుగులు మోయగల బండరాయిని ఎత్తి కోడి రామమూర్తి నాయుడు ఆ రోజుల్లోనే అందరి ప్రశంసలు పొందేవారు. అప్పటి నుండి ఇప్పటివరకు విఖ్యాత మల్లయోధుడిగా కోడి రామమూర్తికి చరిత్ర ఉంది. అటువంటి విఖ్యాత మల్లయోధుడి వద్దనే తన శక్తిని నిరూపించుకున్న ఘనత మన గంగరాజుకుంది. ఏనుగులెత్తిన బండ రాళ్లను కోడి రామమూర్తి నాయుడు ఎత్తేవారు. దీన్ని చూసిన గంగరాజు నివాసముండే మండలాల ప్రజలు గంగరాజును 'మీరా పని చేయగలరా?' అని సవాలు విసిరారు. పందెం కడితే అదెంత పని అని గంగరాజు సవాలును స్వీకరించారు. ఒక శుభముహూర్తం రోజున బండరాయిని ఎత్తమని గ్రామస్తులు కోరారు. గంగరాజు కోడి రామమూర్తి కంటే అవలీలగా బండరాయిని ఎత్తి అవతల పడేసి తన శక్తిని నిరూపించుకున్నారు. దీన్ని చూసిన కోడి రామమూర్తి నువ్వు ఇలాంటి ఫీట్లు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్లు తోక ముడవాల్సిందేనని గంగరాజుకు చేతులెత్తి నమస్కరించారని చెబుతారు. ఈయన సోదరుడు కూడా బలశాలే. సంగీత గంగరాజుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ, రెండవ కుమారుడు బ్రహ్మయ్య, మూడవ కుమారుడు వెంకట రెడ్డి (చిన్నకాపు), సత్యవతి, లక్ష్మీ తిరుపతమ్మ అనే ముగ్గురు కుమార్తె లున్నారు. గంగరాజు మూడవ కుమారుడు. సంగీతం వెంకట రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు.