పూర్వం రాజవంశీయులు మనదేశంలో తమ ధనాన్ని ఎక్కువగా రాళ్ళు (అనగా రత్నాలు) కొనుగోలుకు ఖర్చు చేసేవారు. ఈ వజ్రాలు, రత్నాలు క్రయ విక్రయాలు చేసేవారు రత్న బలిజలు అనే వారు. వీరు బలిజలు లేదా వణిజులలో అత్యంత శ్రేష్ఠులు, ధనికులు. వీరు రత్నాలను రాజులకు ధనికులకు విక్రయించి మంచి ధనాన్ని గడించేవారు. ఆ ధనంతో అపారమైన భోగాలు విలాసాలు అనుభవించేవారు. ప్రజలనుండి పన్నులరూపంలో వసూలుచేసిన సొమ్ములు రాజులు ప్రజావసరాలకు ఖర్చు చేయకుండా తమ విలాసాలకు రత్నాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేసేవారు. ఆ రత్నాలు అమ్మి సొమ్ములు గడించే రత్న బలిజలు ఆ సొమ్ములతో ప్రజావసరాలకు ఉపయోగించకుండా రకరకాల భోగాలు అనుభవించేవారు. కడకి ఎవరికీ సొమ్ములు మిగిలేవి కావు. అందుకే రాజుల సొమ్ము రాళ్ళపాలు బలిజల సొమ్ము భోగాల పాలు అని ప్రజలు చెప్పుకునేవారని, అందుకే ఈ సామెత పుట్టిందని గోదావరి జిల్లాల్లో నివసిస్తున్న రత్నబలిజ కులస్తులైన పోలిశెట్టివారి వంశ చరిత్రలో ఉన్నది.