బ్రిటీష్ వారి దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిన జెండా వీరుడు
భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. 1930 మే 6వ తేదీన స్వామి తత్వానంద నేతృత్వంలో కాంగ్రెస్ వాలంటీర్లు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్కు చేరుకున్నారు. అక్కడ వున్న స్థంభానికి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించారు.వారి ఆలోచనలు పసిగట్టిన బ్రిటీష్ సామ్రాజ్యం తుపాకులు, దళాలతో వచ్చి వారిని అడ్డుకున్నారు. బ్రిటీష్వారి దాష్టికాన్ని తట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి " ఓ యువకుడు ఒంటి నిండా రక్తం కారుతున్నా చలించకుండా సుమారు ॥ నిముషాలపాటు జాతీయ పతాకాన్ని స్థంభంపై నిలిపి తన దేశభక్తిని చాటాడు. ఆ యువకుడే స్వాతంత్ర్యోద్యమంలో 'జెండా వీరుడు'గా ప్రసిద్ధి గాంచిన తోట నరసయ్య నాయుడు. మొదటి నుంచి విప్లవ భావాలు కలిగిన తోట నరసయ్య నాయుడు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్పిటేల్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని వారి ఆదేశాల అనుసారం ఉద్యమం చేసేవారు. బ్రిటీష్ పోలీసులు లాఠీల దెబ్బలతో అనారోగ్యానికి గురైన నర్సయ్య నాయుడు కొద్దికాలానికి తుదిశ్వాస విడిచారు. ఆ మహనీయుని " స్మరిస్తూ ఇప్పటికీ కూడా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఉన్న స్థంభంపై ప్రతిరోజూ సూర్యోదయాన జండావందనం, సూర్యాస్తమ సమయాన జండా అవనతం చేయడం అనవాయితీగా వస్తోంది.