ఆంధ్రరత్న అబ్బిరెడ్డి రామదాసు |
ఆద్యంతం రసవత్తరంగా
అమలాపురం పట్టణంలోని చెడీ విన్యాసాలు అద్యంతం రసవత్తరంగా సాగుతాయి. 1835లో కొంకాపల్లిలో దసరా ఉత్సవాలు ప్రారంభమైతే.. మహిపాలవీధికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు 1856లో చెడీ తాలింఖానా విన్యాసాలకు అంకురార్పణ చేశారు. అప్పట్లో మహిపాలవీధిని వేదికగా చేసుకుని యువతకు సానబెడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడుగా పేరొందిన రామ దాసు యుద్ధకళకు బీజం వేశారు. ప్రాచీన యుద్ధ విన్యాసాలను తలపించే రీతిలో సాగే చెడీ తాలింఖానా అద్యంతం ఉద్విగ్నభరి తంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని కత్తి పట్టి.. మనిషి పొత్తికడుపుపై కొబ్బరికాయలు.. కాయగూరలు ఉంచి వాటిని ఒక్క వేటుతో పగలకొట్టడం చూస్తే.. ఒళ్లు గగుర్పాటుకు లోను కాక తప్పదు. ఇక అగ్గిభరాటాల ప్రదర్శనతో పాటు చెడే తాలిం ఖానా విద్యను చూసినవారంతా ఉత్కంఠకు లోనవుతారు.
వీధికో.. ప్రత్యేకత
ఊరేగింపు ఉరకలెత్తించేలా
దసరా ఉత్సవాలు అనగానే అమలాపురం పట్టణంలో సాగే ఊరేగింపు ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు బారులు తీరతారు. ముఖ్యంగా పట్టణంలో సాగే ఊరేగింపులో వీధులన్నీ ప్రజలతో నిండిపోతాయంటే.. అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విద్యుత్తు దీపాలంకరణలతో సాగే ఆయా వీధులకు చెందిన వాహనాలను చూస్తే.. భక్తిపారవశ్యంతో తన్మయం కాకత ప్పదు. మహిపాలవీధిలోని రాజహంస వాహనం, గండువీధి శేషశ యన వాహనం, నల్లా వీధి శ్రీ విజయదుర్గ అమ్మవారి వాహనం, రవణంవీధి శ్రీ మహిషాసురమర్దని వాహనం, రవణం మల్లయ్య వీధి గరుడ విష్ణు వాహనం, కొంకాపల్లి ఏనుగు అంబారీ, ఆంజనేయ స్వామి వాహనం, శ్రీరాంపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహ నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తొలుత ఆయా వీధుల్లో ప్రారంభమయ్యే ఊరేగింపు ముమ్మిడివరం గేటు మీదుగా గడియా రస్తంభం కూడలిలోకి చేరుకునే సరికి అన్ని వాహనాలు కనువిందు చేస్తుంటాయి. ముఖ్యంగా శక్తివేషాలు, బుట్టబొమ్మలు, కోయ డ్యాన్సులు, తీన్మార్, మ్యూజికల్ బ్యాండ్లు, డప్పు వాయిద్యాలతో పాటు భాజాభజంత్రీలు అద్యంతం అలరించనున్నాయి. మరింకెం దుకు ఆలస్యం దసరా ఉత్సవాలు చూసేందుకు వెళ్లొద్దాం రండీ..