Fill the form, we are preserving balija surnames and their history.

Samatham Krishnayya Naidu

మాతృభూమి గౌరవాన్ని నిలపటంలో గొప్ప ధైర్యసాహసాలు, అంకిత భావాన్ని ప్రదర్శించిన ఫ్రెంచి పౌరులకు ఫ్రెంచి ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ అవార్డు Order de la Nation (Order of the Nation). ఫ్రెంచి ఇండియా మొత్తానికి ఈ అవార్డును పొందిన ఒకే ఒక వ్యక్తి శ్రీ సమతం కృష్ణయ్య. వీరు యానానికి చెందిన ఒక కవి, పండితుడు, నాయకుడు, ఆయుర్వేద వైద్యుడు అన్నింటికీ మించి ఫ్రెంచి వారిపట్ల అచంచలమైన విశ్వాసాన్ని భక్తిని ప్రదర్శించిన ఒక విధేయుడు. 19 వ శతాబ్దాంతంలో రాజకీయాలలో రాణించిన సమతం వెంకట సుబ్బారావు కు వారసునిగా సమతం కృష్ణయ్య రాజకీయ ప్రవేశం చేసి యానాం మున్సిపల్ కౌన్సిలర్ గా, స్కూల్ కమిటీ అధ్యక్ష్యునిగా, దేవాలయకమిటీ ధర్మకర్తగా, మేయర్ గా పనిచేసారు. ఫ్రెంచి యానానికి చివరి మేయర్ ఈయనే.1947 లో భారతదేశం బ్రిటిష్ వారి పాలననుండి విముక్తమైన నేపథ్యంలో యానాంలో కూడా జాతీయవాద వాదనలు బలపడి ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా 'యానాం విమోచనోద్యమం' ఊపందుకొంది. ఆ దశలో ఫ్రెంచి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న కారణంతో ప్రజలచే ఎన్నికకాబడిన మేయరైన మద్దింశెట్టి సత్యానందం ను తొలగించి సమతం కృష్ణయ్యను 1954 లో మేయరు గా ఫ్రెంచి ప్రభుత్వం నియమించింది.


ఫ్రెంచి విధేయుడైన సమతం, ఫ్రెంచి పాలన యానాంలో కొనసాగాలని కోరుకొనే ప్రజలను సమీకరించటం, సభలు సమావేశాలు నిర్వహించి భారతదేశ భక్తులు చేస్తున్న ఫ్రెంచి వ్యతిరేక పోరాటాన్ని ఖండించటం వంటి పనులు చేసారు. 78 సంత్సరాల వయసులో, శారీరిక అనారోగ్యంతో ఉన్నప్పటికీ, తాను నమ్మిన సిద్ధాంతాలను, విశ్వాసాలను మనసా వాచా కర్మణా అమలు చేయటానికి ఈయన పరిశ్రమించారు. ఫ్రెంచి వ్యతిరేక వాదులపై చట్ట పరమైన చర్యలు గైకొనాలని కోర్టును ఆశ్రయించారు.ఫ్రెంచి పాలనకు వ్యతిరేక ఉద్యమం పతాకస్థాయికి చేరుకొని విమోచనోద్యమకారులు జూన్ 13, 1954 న యానాంను ఫ్రెంచి పాలననుండి విముక్తి చెందించారు. అంతవరకూ యానాంలో ఫ్రెంచి అనుకూలురుగా వ్యవహరించిన అనేక మంది దాడులు జరుగవచ్చునన్న భయంతో ఊరువిడిచి పారిపోయారు. కొంతమంది ఇంటి అటకలపై, గడ్డిమేట్లలో, నూతులలో గోదావరి లంకలపై దాక్కున్నారట. కానీ శ్రీసమతం ఆత్మ రక్షణార్ధం పిస్తోలు చేతబూని యానాంలోనే ఉన్నారు.విమోచనోద్యమ కారులకు రక్షణ కల్పించటానికి కాకినాడ కలక్టరు గారి ఆదేశాలమేరకు అనేక మంది భారత సాయుధ పోలీసులు యానాంలోకి వచ్చారు. ఆరోజు జరిగిన విజయోత్సవ ఊరేగింపు సాగిస్తున్న భారతదేశ భక్తులకు, స్థానిక యంగ్మెన్స్ లైబ్రేరీ మేడపైనుంచి చూస్తున్న శ్రీసమతం కనబడటం జరిగింది. ఆయన చేతిలో స్వీయరక్షణార్ధం ఉన్న పిస్తోలును చూసి ఆయనే కాల్పులు అనుమానంతో సాయుధ పోలీసులు వారిని కాల్చి చంపటం జరిగింది. ఈ మొత్తం ఉదంతం అత్యంత నాటకీయంగా జరిగినప్పటికీ, శ్రీ సమతం ఫ్రెంచి మాతృభూమి కోసం ధైర్యసాహసాలు, అకుంఠితమైన భక్తిని ప్రదర్శించి అసువులుబాసారు. వీరి ప్రాణ త్యాగాన్ని గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం 19జూన్, 1954 న వీరికి Order of the Nation అనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించటం ద్వారా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకొంది.

Post a Comment

Previous Post Next Post