తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 - మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
జీవిత చరిత్ర:
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.